Thursday, April 3, 2014

నాన్ననాన్న మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయి అప్పుడే ఐదు నెలలు నిండిపోయాయి. నాన్న ఏదైనా ఊరెళ్ళారేమో, మళ్ళా వస్తారేమో అని మనసుని ఎంత భ్రమింపచేసుకున్నా ప్రతి నెలా వచ్చే తిథి నాన్న ఇంకెప్పటికీ రారు అని వెక్కిరిస్తూ చెప్తునట్టు ఉంటుంది. "తల్లీ పిల్లలు జాగ్రతమ్మా" అంటూ పొద్దున్న మాట్లాడిన నాన్న ఎనిమిది గంటలు తిరగకముందే ఎన్నటికీ తిరిగి రాని తీరాలకి వెళ్ళిపోవటం నమ్మలేని జీర్ణించుకోలేని నిజం. పార్వతీ దేవిలా పచ్చగా కళకళలాడిపోయే అమ్మని ఇలా చూడాలి అంటే కడుపు తరుక్కుపోతోంది, కానీ ఇదే జీవితమేమో!!! మా తరం వాళ్ళలో చాలా మందికి నాన్న అంటే పెద్ద పులే. నాన్న సైకిలు బెల్లు వినిపించినా, నాన్న బండి చప్పుడు వినిపించినా అప్పటి వరకు ఎంత తోకలేని కోతుల్లా ఎగిరిన వారైనా ఎక్కడి దొంగలు అక్కడే గప్ చుప్ అంటూ పుస్తకాన్ని తిరగేసి ఐనా సరే పట్టేసుకుని తెగ చదివేస్తున్నట్టు నటించని వాళ్ళు చాలా అరుదేమో. మేము కూడా ఇలా పెరిగిన వాళ్ళమే. నాన్న అంటే గౌరవంతో కూడుకున్న భయం, అయిష్టంలా అనిపించే ప్రేమ, "అబ్బ మీ ఆయన కోపం తో చచ్చిపోతున్నామే అమ్మా" అంటూ విసుక్కున్నా ఆ మనిషి ఒక్క రోజు ఏదైనా పొరుగూరికి వెళ్తే నిద్ర పట్టని ఎటాచ్మెంట్. నాన్న బొజ్జ మీద పడుకుని ఊయలలూగలేదు, నాన్న మీసాలు లాగుతూ ఆడుకోలేదు, కనీసం ఒక్కసారైనా నువ్వు అని పిలిచిన జ్ఞాపకం లేదు. కానీ ఈ జీవితం నాన్న పెట్టిన భిక్షే అని తల్చుకోని రోజు ఉండదు. మాకు మూడు పూటలా అన్నం పెట్టటానికి మంచి నీళ్ళు తాగి పడుకున్న రోజులు గుర్తే. మాకు పుట్టిన రోజుకి బట్టలు కొనాలి అని బస్ ఎక్కటం మానేసి డబ్బులు కూడ పెట్టిన ప్రేమ గుర్తే. బయటకి ఎంత కఠినంగా కనిపించినా ఆ కరుకుతనం వెనక మమ్మల్ని పైకి తీసుకు రావాలి అన్న తపన తెలుసు. మా ప్రతి విజయన్నీ నాన్న కళ్ళల్లో తళుక్కుమని మెరిసి మాయమైపోయే గర్వపు రేఖలో చూసి ఆస్వాదించే వాళ్ళము. ఏదైనా సమస్య ఉందని చెప్తే ఓస్ ఇంతేనా అంటూ సలహాలు ఇచ్చినా అయ్యో వీళ్ళు ఎలా తట్టుకుంటారో అనుకుంటూ నిద్ర పోకుండా రాత్రి తెల్లవార్లూ మేలుకున్న నాన్న మాకు ధైర్యం, స్థైర్యం. "అమ్మా వెళ్ళిపోతున్నావా పిల్లలు లేకపోతే ఏమీ తోచదమ్మా" అన్నప్పుడు మొదటిసారి నాన్న గొంతులో పలికిన దైన్యం ఇప్పటికీ మనసుని పిండేస్తుంది. అప్పటి వరకూ స్కైప్ లో మాట్లాడుతూ ఉన్న నాన్న కడుపులో ఇబ్బందిగా ఉంటోంది అంటూ ఆసుపత్రిలో చేరటం, కాలేయపు కాన్సర్ ఆఖరి స్టేజ్ లో ఉందని తెలియటం, అమ్మా ఇంకెప్పుడూ మిమ్మల్ని చూడనేమో అని అనటం, ఇంకెప్పుడూ తిరిగిరాని తీరాలకి చేరుకోటం అన్నీ రెప్పపాటులో జరిగిపోయాయి. We lost our guide, mentor, adviser and our support system forever. Miss you నాన్న