Thursday, March 20, 2014

బ్లాగ్లోకంలోకి మళ్ళా నేను-లక్ష్మి

ఏమిటో చూస్తుండగానే నాలుగేళ్ళు గడిచిపోయాయి బ్లాగుల నుండి దూరం అయ్యి. కొత్త బ్లాగు తెరిచి రెండు నెలలు కావొస్తున్నా రాసే ధైర్యం మాత్రం రావటం లేదు. రాయతం బొత్తిగా మరిచినట్టే ఉంది. వెళ్ళిపోయినదానివి మళ్ళా ఎవరిని ఉద్ధరించటం కోసం ఈ ప్రయత్నాలు అంటే నాకోసమే, నాతో నేను మాట్లాడుకోటం కోసమే అనుకోవచ్చు. ఈ నాలుగేళ్ళలో అబ్బో చాలా మార్పులే వచ్చేసాయి. ఇంకో బుడ్డి బుడిగి కి అమ్మని అయ్యాను, అదేమో నాకు ఇంత సహనం ఉందా అన్నంత పరీక్షిస్తూ బోల్డంత అల్లరి చేస్తూ కబుర్లు చెప్తూ నన్ను విరామం లేకుండా పరుగులు పెట్టిస్తోంది. కర్మ భూమి నుండి కూడా దూరంగా ఈ భోగ భూమి కి వచ్చేసాను, ఇది మాత్రం అనుకోని మార్పే. అన్నిటికంటే తట్టుకోలేని మార్పు మాత్రం నాన్నగారిని కోల్పోటం. అమ్మా పిల్లలు జాగ్రత్త అంటూ ఉదయం నాతో మాట్లాడిన మా నాన్న ఎనిమిది గంటలైనా తిరక్కుండానే మమ్మల్ని ఒంటరివాళ్ళని చేసి శివైక్యం పొందారు. ఇంకా ఎన్నో కూడికలూ, తీసివేతలూ జీవితాన్ని మరింత దగ్గరిగా మరింత లోతుగా మరింత నిర్లిప్తతగా చూడటం అలవాటు చేసాయి.
 
బ్లాగు ప్రపంచంలో కూడా చాలా చాలా మార్పులే వచ్చేశాయి. పాత నేస్తాలు చాలా మంది దాదాపుగా కనుమరుగైపోయారు, కొత్త నీరు చాలానే ప్రవహించింది. కొంతమంది పాత నేస్తాలు అప్పుడప్పుడు రాస్తున్నా రాశి చాలా తక్కువనే చెప్పాలి. మొత్తానికి నేను కొత్త ప్రపంచం లో అడుగుపెడుతున్న భావనే వస్తోంది. మళ్ళా మొదటిసారి అడుగులు వేస్తున్నట్టే ఉంది, ఈ తప్పటడుగులు ఎప్పటికి స్థిరపడతాయో తెలియదు.
 
నేనెవరో తెలియని కొత్త మిత్రులకి నా పేరు లక్ష్మి, నా పాత నేస్తాలకి నేను-లక్ష్మి. నువ్విప్పుడు ఎవరికి గుర్తుండి ఉంటావు అని లోపలి నుండి ఎవరో తెగ కేకలు పెడుతున్నారు కానీ, నేను మాత్రం కొద్దిమందికైనా గుర్తుకు రాకపోతానా అని ఆశావహ దృక్పధంతో ధైర్యే సాహసే లక్ష్మి అనుకుంటూ ఇలా మళ్ళా నా రాతలకీ ద్వితీయ శ్రీకారం చుడుతున్నా.
 
ప్రస్తుతానికి నా కొత్త బ్లాగుకి రంగులు హంగులు అద్దుతున్నా, అదయ్యాక మళ్ళా వస్తా.